గడచిన రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ దగ్గర ఉద్యమం చేస్తున్న రైతసంఘాలు తమ ఆందోళనలో మరింత జోరు పెంచుతున్నారు. రెండునెలల ఉద్యమం ప్రశాంతంగానే జరిగినా జనవరి 26వ తేదీన జరిగిన ర్యాలీ మాత్రం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం అందరికీ తెలిసిందే. ర్యాలీలో కానీ తర్వాత అనేక అవాంఛనీయ ఘటనలు జరిగాయి.
దీన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు వందలమంది రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారు. ఇంకా అనేక కేసులు నమోదు చేస్తునే ఉన్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అణిచివేతలకు చర్యలు తీసుకుంటున్నా రైతులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ర్యాలీ తర్వాత ఒకటిరెండు సఘాలు ఉద్యమం నుండి విడిపోయాయి. దాంతో ఉద్యమం తొందరలోనే నీరుగారి పోతుందని ప్రభుత్వం అనుకున్నది.
అయితే అనూహ్యంగా మరింతమంది రైతులు ఉద్యమంలో భాగస్తులవుతున్నారు. ఎక్కడెక్కడి నుండో రైతులు వచ్చి ఉద్యమంలో జాయిన్ అవుతున్నారు. శుక్రవారం కూడా వేలాదిమంది రైతులు పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి సింఘూ ఘజియాబాద్ ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమానికి పోటెత్తారు. సింఘు ప్రాంతానికి వస్తున్న రైతుల వల్ల తలెత్తుతున్న ఉద్రిక్తతలను అదుపుచేయటం కోసం పోలీసులు భాష్పావాయువులను ప్రయోగించారంటేనే పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు.
మహాత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేయాలన్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ఇచ్చిన పిలుపుకు వేలాదిమంది రైతులు సానుకూలంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో జరిగిన మహాపంచాయత్ కు హాజరై తికాయత్ పిలుపుకు తమ సంఘీభావం ప్రకటించటంతో రైతుల ఉద్యమం తొందరలోనే తీవ్రతరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. మొత్తానికి జనవరి 26 నాటి ఘటనల తర్వాత రైతుఉద్యమం నీరుగారి పోతుందని అనుకున్న వాళ్ళకు ఇఫుడు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.