టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఈ ఏడాదిని క్రాక్ సినిమాతో విజయవంతంగా ప్రారంభించాడు. ఆయన నటించిన మాస్ యాక్షన్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ ఇప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా సినిమాలు క్రాక్ తో పోటీ పడినప్పటికి సంక్రాంతి విజేతగా క్రాక్ నిలిచింది. ఒంగోలులో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా నటించగా.. ప్రముఖ తమిళ నటులు సముద్రఖని వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలకపాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన క్రాక్ వారి అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. అందుకే ఇంతటి విజయాన్ని కట్టబెట్టారు అభిమానులు.
ఇదిలా ఉండగా.. క్రాక్ మూవీ విడుదలైన సమయంలోనే ఈ సినిమాను తమిళ మలయాళ భాషలలోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే క్రాక్ అనువాదం విడుదలకు రెడీ అయ్యిందట. ఫిబ్రవరి 5న తమిళ మలయాళంలో క్రాక్ డబ్ వెర్షన్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. ఫిబ్రవరి 6న క్రాక్ మూవీ తెలుగులో డిజిటల్ రిలీజ్ అవుతోంది. అల్లు అరవింద్ భారీ ధరకు క్రాక్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 6న ఆహా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో క్రాక్ హ్యాట్రిక్ సినిమాగా రూపొందింది. అయితే ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించారు.