కరోనా క్రైసిస్ వల్ల వినోద పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి.
కరోనా క్రైసిస్ వల్ల వినోద పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి.

ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. భారీ పారితోషికాలు అందుకుని సెటిలైన కొందరు అగ్ర తారలు .. టెక్నీషియన్లు మినహా ఇతర వర్గాలు మాత్రం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా థియేటర్ రంగ కార్మికులు మరీ దారుణంగా ఆత్మహత్యలకు పాల్పడే సన్నివేశం ఎదురైంది. 24 శాఖల్లో రోజువారీ కూలీతో బతికే కార్మికుల వెతలకు అయితే అడ్డూ ఆపూ లేదు.అయితే ఇటీవల నెమ్మదిగా పరిశ్రమలు కోలుకుంటున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ షూటింగులతో బిజీ అయ్యి థియేటర్లను తెరవడం ఉత్సాహాన్ని పెంచుతోంది.  ఫిబ్రవరి 1 నుంచి 50శాతానికి మించి ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లను నడిపించుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాల్ని విడుదల చేసి ఆ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధినాలు రూపొందించుకోవచ్చని తెలిపింది. ఇన్నాళ్లు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నవాటిలో ఇకపై పెంచుకునే వీలును కేంద్రం కల్పించింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి ఈ ఆక్యుపెన్సీ మరింత  పెరగనుంది. ఈ పెంపు 75 శాతం వరకూ తొలిగా ఉంటుందని ఓ అంచనా.

ఇక థియేటర్ల నుంచి రెవెన్యూ పెరిగితే ఆటోమెటిగ్గా నిర్మాతల్లో పంపిణీ వర్గాల్లో ఉత్సాహం పెరిగి సినిమాలు తీసే శాతం పెరుగుతుంది. తద్వారా ఉపాధి పెరుగుతుంది. ఇది మంచి పరిణామమే కానీ.. రాష్ట్రప్రభుత్వాల నుంచి పరిశ్రమకు మరింత ఊరట అవసరమన్న విశ్లేషణ సాగుతోంది.

ఏడాది పాటు దెబ్బ తిన్నందుకు పరిశ్రమలకు ఊరట కల్గించేలా ఇంకేదీ కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ చేయవా?  కొన్నాళ్ల పాటు జీఎస్టీ సహా ఇతర పన్నుల బాదుడును పరిమితం చేస్తే ఆ మేరకు సినిమా రంగం వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జిబిటర్లకు కరెంటు బిల్లులు రెంట్లు వగైరా తగ్గేలా చేయగలిగితే మరింత మేలు జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిదానిపైనా పన్ను బాదుడు తగ్గితే పరిశ్రమలు వేగంగా కోలుకునే వీలుంటుందన్న సూచన చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here