తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు సీఎం కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కాబోయే సీఎం కేటీఆర్ అంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక, అప్పటి నుంచి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనేది తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసిన అదే చర్చ నడుస్తోంది. ఇక కొందరు టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులైతే కేటీఆర్ సీఎంగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక, తాజా కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని బొంతు రామ్మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడూతూ కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే ప్రచారంపై స్పందించారు. దేవుని ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారు.. అన్నిటికి సమయం సందర్భం రావాలని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏం జరగాలనేదానిపై ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల ఆమోదంతోనే కేటీఆర్ సీఎం పదవిలో కూర్చుంటారని చెప్పుకొచ్చారు.
ఇక, స్వామివారిని సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రజలందూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్న కేసీఆర్‌కు.. బంగారు తెలంగాణ సాధన కోసం మరింత శక్తిని ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థించినట్టు చెప్పారు.