రాజకీయాల్లో పదవులతో సంబంధం లేకుండానే కొందరు నేతలు ప్రజల్లోకి దూసుకెళుతుంటారు. ప్రజల్లో, పార్టీలో తమకున్న పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తెలంగాణలోని కీలక నేతల్లో ఒకరిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడు కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లోనూ అదే విధంగా దూసుకుపోతున్నారు. పార్టీలోకి వచ్చిన కొద్దికాలానికే ఏకంగా టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిపోయారు. అయితే తృటిలో ఆయనకు ఆ పదవి దక్కకుండా పోయింది. అయితే భవిష్యత్తులో ఆయనకే ఈ పదవి దక్కడం ఖాయమని ఆయన సన్నిహితులు, కాంగ్రెస్‌లోని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తనకు టీపీసీసీ చీఫ్ పదవిపై ఆసక్తి లేదని.. తనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావాలని రేవంత్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఈ పదవి ఎఫ్పుడు ప్రకటించినా.. అది తనకే వస్తుందని ఫిక్స్ అయిన రేవంత్ రెడ్డి.. ఆ పదవితో సంబంధం లేకుండానే ప్రచార కమిటీ చైర్మన్ తరహాలో తెలంగాణలో పర్యటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆర్మూర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
భవిష్యత్తులో తెలంగాణవ్యాప్తంగా జరిగే ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల తెలంగాణవ్యాప్తంగా తన ఇమేజ్ను మరింతగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవి వచ్చిన తరువాత తెలంగాణవ్యాప్తంగా పాదయత్ర చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
గతంలో వైఎస్ తరహాలో పాదయాత్ర చేయడం ద్వారా సొంత పార్టీలో ఇమేజ్ పెంచుకోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి, తనకు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో క్రేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా స్థానిక నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏదో రకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్‌తో పాటు సొంతంగా తన ఇమేజ్ పెంచుకోవడంపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.