తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలో ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. కొన్నేళ్లుగా వర్గవైషమ్యాలతో సతమతమవుతున్న పంచాయతీ నేడు ఏకమైంది. దీంతో సర్పంచ్‌ పదవికి వైస్సార్‌సీపీ అభిమాని ఒక్కరిదే నామినేషన్‌ దాఖలైంది. ఇది ఓర్వలేని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ హుటాహుటిన గురువారం రాత్రి 12 గంటల సమయంలో శెట్టిపల్లెకు చేరుకున్నారు. స్థానిక కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎలాగైనా పోటీకి నామినేషన్‌ వేయించాలని విఫలయత్నం చేశారు. అయితే వీరి రాకను గమనించిన స్థానిక టీడీపీ నాయకులు ముఖం చాటేశారు.

నాటి హామీపై నిలదీత! 
తిరుపతి అసెంబ్లీకి 2012లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు శెట్టిపల్లెలో రోడ్డు షో నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే శెట్టిపల్లె భూమల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆగ్రహించిన గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సమయం కోసం వేచి చూశారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిన టీడీపీ నేతలకు గట్టి సమాధానమిచ్చారు.

సమస్యల పరిష్కారానికే ఏకగ్రీవం  
సమస్యలను పరిష్కారానికే పారీ్టలను పక్కనపెట్టి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నట్లు శెట్టిపల్లె వాసులు శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here