సొంతూళ్లకు పంపాలంటూ రాజమహేంద్రవరంలో వలస కార్మికుల ఆందోళన

తమను సొంతూళ్లకు పంపించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహార్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది కూలీలు వచ్చారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ రాజమహేంద్రవరం నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో.. ఈ ఉదయం వీరంతా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లాలా చెరువు కూడలి వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోకుండా ముందుకుసాగారు. ప్రత్యేక రైళ్లలో తమను సొంతూళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు రైళ్లు సాధ్యం కాదని, కొంత సమయం ఇవ్వాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కూలీలు ఆందోళనకు దిగారు.
Tags: Andhra Pradesh, Rajamandri, Migrant Labour, ap police