మరో 82 మంది.. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

గడిచిన 5 రోజులుగా రోజుకు కనీసం 60కి తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 82 పాజిటివ్ కేసులు వెలువడ్డాయి. గడిచిన 24 గంటల్లో 5783 శాంపిల్స్ పరీక్షించగా.. వీళ్లలో 82 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్థారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1259కు చేరింది.

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో.. కర్నూలులో అత్యథిక కేసులు వెలుగుచూశాయి. ఆ జిల్లాలో ఒకేసారి 40 కేసులు బయటపడ్డాయి. ఇక గుంటూరులో మరో 17, కృష్ణాలో 13, నెల్లూరులో 3, కడపలో 7, అనంతపురం-చిత్తూరులో చెరో కేసు బయటపడ్డాయి.

గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని అధికారులు ప్రకటించారు. పోగా, మరింతమంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటల వరకు 258 మంది డిశ్చార్జ్ అయినట్టు ప్రకటించారు.

ఇక మొత్తం కేసులను ఓసారి పరిశీలిస్తే.. తాజా ఫలితాలతో కర్నూలు 3వందల మార్క్ దాటి, 332కు చేరింది. తర్వాత స్థానంలో 254 కేసులతో గుంటూరు, 223 కేసులతో కృష్ణా ఉన్నాయి. నెల్లూరులో 82, కడపలో 65 కేసులున్నాయి.

అటు విశాఖపట్నంలో కేవలం 3 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. లెక్కప్రకారం వాళ్లను డిశ్చార్జ్ చేయాలి. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని రోజులు వాళ్లను అబ్జర్వేషన్ లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు శ్రీకాకుళంలో ఇప్పటికే ఉన్న 4 పాజిటివ్ కేసులకు అదనంగా మరో పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా నిర్థారించలేదు.