రోజా సహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్ లు ఉన్నారు. కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది .

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసరాలను పంచడం, డబ్బు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేశారు. ఈ కార్యక్రమాల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి.
Tags: YSRCP, MLAs, Lockdown, AP High Court, Notice