ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల కీలక నిర్ణయం

  • జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని రవాణా శాఖకు దరఖాస్తు
  • త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు
  • రాష్ట్రంలో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 800 బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెలాఖరు వరకు బస్సులు నడపకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని పన్ను మినహాయింపు పొందాయి. రాష్ట్రంలో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 800 బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 బస్సుల యాజమాన్యాలు బస్సులు నడపబోమని తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి.

రవాణా వాహనాలను మూడు నెలలపాటు నడపకూడదని భావిస్తే త్రైమాసిక పన్ను నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పన్ను మినహాయింపు కావాలంటే మార్చిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజారవాణా ఆగిపోవడంతో మార్చిలోనే ఆయా బస్సుల యాజమాన్యాలు బస్సులు నడపబోమంటూ రవాణాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి.

ఇక ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులకు రవాణాశాఖ అధికారులు అనుమతి ఇవ్వడంతో తాజాగా 400కుపైగా బస్సుల యాజమాన్యాలు జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకుని త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి.
Tags: Private Travels, Andhra Pradesh, Corona Virus