కేంద్ర ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగ పడదు: వినోద్‌ కుమార్

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కుదేలవుతోన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విమర్శలు చేశారు. ఆ ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగ పడేవిధంగా లేదని చెప్పారు. విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ప్రకటించడం విడ్డూరమేనని అన్నారు.

విమానయాన రంగంలో సంస్కరణల వల్ల దేశంలోని పేదలకు ప్రయోజనం ఎలా ఉంటుందని వినోద్ నిలదీశారు. కేంద్ర ప్యాకేజీలో దేశంలోని సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు జీడీపీలో 15 శాతం వరకు రాష్ట్రాలు, ప్రజలకు సాయంగా ప్రకటించాయని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలయిందని ఆయన తెలిపారు.
Tags: Vinod Kumar, TRS, Telangana