కేటీఆర్ కు ట్వీట్.. అర్థరాత్రి వేళ పాపకు పాలు.. పండ్లు

సాయం చేసే మనసున్న వారి చేతుల్లో అధికారం ఉంటే కలిగే ప్రయోజనం అంతా ఇంత కాదు. అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్ తనకు అందే వినతుల విషయంలో ఎంత వేగంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఆ కోవకు చెందిందే. కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు రోజుకు వందలాది వినతులు వస్తుంటాయి. అందులో ఏ మాత్రం విషయం ఉన్నా..టైం అన్నది చూసుకోకుండా సాయం చేస్తుంటారు.

తాజాగా హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో నివపించే వ్యక్తికి ఐదు నెలల పసికందు ఉంది. అతడి భార్య అనారోగ్యంతో కొద్ది నెలల క్రితం చనిపోయింది. దీంతో.. ఆ పాప బాధ్యతను తండ్రే చూసుకుంటున్నాడు. వలసజీవి అయిన అతడికి కరోనా కారణంగా కిందామీదా పడిపోతున్నాడు. లాక్ డౌన్ వేళ.. అతడి దైన్యాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు కేటీఆర్ కు ట్వీట్ చేశారు. పసిపాపకు పాలు ఇవ్వలేని అతడి పరిస్థితిని గుర్తించిన ఒకరు ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించిన కేటీఆర్.. ఆ వ్యక్తిని గుర్తించి పాపకు అవసరమైన పాలు అందజేయాలని కోరారు.

దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అరగంట వ్యవధిలో వారింటికి వెళ్లారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పాలు.. బిస్కెట్లు ఇతర వస్తువులతో చేరుకొని సదరు వ్యక్తికి అందించారు. ఈ సాయాన్ని చూసిన కాలనీ వాసులు కేటీఆర్ పెద్ద మనసును కొనియాడారు. తాను చెప్పినంతనే స్పందించిన డిప్యూటీ మేయర్ ను కేటీఆర్ ట్వీట్ తో అభినందించారు.