మామిడి కౌలు రైతులకు 50వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాలి వాన బీభత్సానికి కంది మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం..
…. నష్టపోయిన మామిడి పంటను పరిశీలించి , రైతులను పరామర్శించిన జగ్గారెడ్డి
… కంది గ్రామంలో పంట నష్టపోయిన మామిడి కౌలు రైతు ధీన స్థితి ని చూసి స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
…. మామిడి కౌలు రైతుకు 50,000(యాభై వేల) ఆర్థిక సహాయం అందజేత

…. అకాల వర్షానికి పంట నష్ట పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి… జగ్గారెడ్డి విజ్ఞప్తి

సంగారెడ్డి నియోజకవర్గం లో నిన్న కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలి వాన బీభత్సం కారణంగా కంది, సంగారెడ్డి మండలాలలో పదుల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగింది. కంది మండలంలో గాలి వానకు నష్టం వాటిల్లిన మామిడి తోటలను మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. రైతులను పరామర్శించారు. అరవై వేలు అప్పు తీసుకువచ్చి రెండెకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నామని, కుటుంబమంతా సహా తోట లొనే ఉండి కష్టపడుతున్నామని కౌలు రైతు లక్ష్మణ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో ఆవేదన వ్యక్తం చేశారు. తీరా కాయలు కోసే సమయానికి గాలి వాన మమ్మల్ని నష్ట పరిచిందని, అప్పులు తీరే మార్గం కనబడటం లేదని రైతు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంట నష్ట పోయిన విషయం తెలుసుకుని ప్రభుత్వ అధికారులు వచ్చారని, పట్టా దారులకు తప్ప కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం రాదని చెప్పారని , తమని ఎలాగైనా ఆదుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని రైతు వేడుకున్నాడు. లక్ష్మణ్ పరిస్ధితి ని చూసి చలించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి రైతు లక్ష్మణ్ కు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రధానంగా కౌలు రైతులు పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. అప్పులు తీసుకువచ్చి మరీ మామిడి తోటలను కౌలుకు తీసుకున్నారని, ఇలాంటి అకాల వర్షాల వల్ల వారు అప్పుల్లో కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.