వీళ్లంతా అప్పుడేమయ్యారంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

ఫేక్ న్యూస్ మీద.. గాసిప్స్ మీద ఒక్కసారిగా టాలీవుడ్లో పెద్ద పోరాటం మొదలైంది. నిన్న విజయ్ దేవరకొండ ఓ వీడియో ద్వారా ఈ పోరాటాన్ని ప్రారంభిస్తే.. వెంటనే సూపర్ స్టార్ మహేష్ స్పందించి, అతడికి మద్దతుగా నిలవడంతో మిగతా ఇండస్ట్రీ కూడా కదిలింది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్‌కి సపోర్టుగా ముందుకొచ్చారు. ఇంకా ఎంతోమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పోరు ఎక్కడిదాకా వెళ్తుందో.. ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి. ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ పోరాటంపై అంత సానుకూలంగా స్పందించట్లేదు. పైగా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.

రెండేళ్ల కిందట పవన్ కళ్యాణ్ మీద ఓ వర్గం మీడియా కత్తిగట్టి వరుసబెట్టి యాంటీ న్యూస్ వేయడం.. కొన్నాళ్లు ఉగ్గబట్టుకుని ఉన్న పవన్ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చడం.. ట్విట్టర్ ద్వారా ఒక్కో మీడియా ఛానెల్ అధిపతిని టార్గెట్ చేసి వాళ్ల బండారాలు బయటపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిన సంగతే.ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టాడు. అప్పుడు పవన్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి కొందరు వచ్చారు. అంతే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ పెద్దగా మద్దతు పలకలేదు. ట్విట్టర్లో కూడా సంఘీభావంగా మెసేజ్‌లు పెట్టలేదు. ఆ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు తెరపైకి తెచ్చారు. పవన్‌కు కష్టం వస్తే.. ఆయన వ్యక్తిత్వ హననానికి మీడియా పాల్పడుతుంటే.. ఎవ్వరూ మద్దతుగా నిలవలేదని.. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ పోరాటానికి మాత్రం ఒకేసారి అందరూ వంత పాడుతున్నారని అంటున్నారు. విజయ్ వెనుక కేటీఆర్ ఉండటంతోనే ఇలా అతడికి మద్దతిస్తున్నారంటూ మరో వాదన కూడా పవన్ ఫ్యాన్స్ తెరపైకి తెస్తుండటం గమనార్హం.