ఉద్యోగుల గొంతుకోసే ప‌త్రిక‌లను ఎందుకు ఆదుకోవాలి?

ఒక వైపు ప‌త్రిక‌ల్లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ, మ‌రోవైపు ప‌త్రిక‌ల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి ఐఎన్ఎస్ లేఖ రాయడం ఏంటి?  క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. గ‌త నెల 22 నుంచి లాక్‌డౌన్ చేప‌డితే…క‌నీసం వారం కూడా గ‌డ‌వక‌నే తెలుగులో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో ఏకంగా 150 మంది జ‌ర్న‌లిస్టుల‌ను తొల‌గించ‌డంతో పాటు ఉన్న వాళ్ల వేత‌నాల్లో భారీగా కోత‌లు విధించారు.

ఇప్పుడు ఇలాంటి ప‌త్రికా య‌జ‌మానులంతా తోడై బీద అరుపులు అరుస్తూ త‌మ‌ను ఆదుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌తో ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం ఆగిన నేప‌థ్యంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న త‌మ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని, ప‌త్రిక‌లు మ‌నుగ‌డ సాగించేందుకు స‌హ‌క‌రించాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్ ) లేఖ రాసింది.

ఈ లేఖ‌లో  పత్రికలకు రెండేళ్ల పాటు పన్ను రాయితీ, న్యూస్‌ప్రింట్‌ మీద దిగుమతి సుంకం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రకటనల ఆదాయం పడిపోవడం, న్యూస్‌ ప్రింట్‌ మీద కస్టమ్స్‌ సుంకం… ఇలా మూడు వైపుల నుంచి వార్తా పత్రికల మీద కోలుకోలేని దెబ్బ పడిందని లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

ఎంత సేపూ యాజ‌మాన్య ప్ర‌యోజ‌నాలే త‌ప్ప ఉద్యోగుల గురించి ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌ని ఈ ప‌త్రిక‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు ఆదుకోవాలి? ఎటూ ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత సోష‌ల్ మీడియాతో పాటు ఇత‌ర మాధ్య‌మాల విస్తృతి పెరిగింది. జ‌నాలు త‌మ‌కు కావాల్సిన స‌మాచారాన్ని సుల‌భంగా ఎప్ప‌టిక‌ప్పుడు పొంద‌గ‌లుగుతున్నారు. అలాంట‌ప్పుడు ప‌త్రికా య‌జ‌మానుల వ్యాపారాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జల న‌డ్డి విర‌వ‌డం దేనికి?

ఖర్చు తగ్గించుకొనే  క్రమంలో భాగంగా వార్తా పత్రికలు పేజీలను బాగా తగ్గించాయని, ఆదివారం అనుబంధాలను ప్రధాన పత్రికల్లో కలిపేశాయని లేఖ‌లో పేర్కొన్నారే….మ‌రి ప‌త్రిక‌ల రేటు మాత్రం సంబంధిత య‌జ‌మానులు ఎందుకు త‌గ్గించ‌లేదు? ప‌త్రిక‌ల పేజీలు త‌గ్గించ‌డం, మ‌రోవైపు ప‌త్రిక రేటును య‌ధావిధిగా కొన‌సాగించ‌డం ద్వారా…సంబంధిత య‌జ‌మానుల‌కు లాభ‌మే త‌ప్ప నష్టం లేదు. అంతేకాదు  ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్టు పెద్ద సంఖ్యలో పత్రికల్లో ఉద్యోగులను తొల‌గిస్తూ న‌ష్టాన్ని పూడ్చుకుంటున్నాయి.  

మ‌రి ప‌త్రిక‌ల‌కు రాయితీలు ఎందుకివ్వాలి? ఈ ప‌త్రిక‌లు తొల‌గించిన ఉద్యోగుల కుటుంబాల‌ను కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకుంటే, వాటికి మంచి పేరు వ‌స్తుంది. అంతే త‌ప్ప‌, ఉద్యోగుల‌ను అత్యంత అమాన‌వీయంగా వీధిన ప‌డేయ‌డ‌మే కాకుండా, సిగ్గు లేకుండా త‌మ‌ను ఆదుకోవాల‌ని ప‌త్రిక‌ల య‌జ‌మానులు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో అర్థం కావ‌డం లేదు.

ఇంత కాలం యాడ్స్ రూపంలో పొందిన ఆదాయాన్ని ఎక్క‌డ బ‌య‌ట‌కు తీయాల్సి వ‌స్తుందోన‌నే భ‌యం త‌ప్ప‌…కొండ‌ల్లా పెరిగిన ఆదాయ సంప‌ద ఎక్క‌డ క‌రిగిపోతుందోన‌నే ఆందోళ‌న ప‌త్రికా య‌జ‌మానుల‌ది. తాను కూత కూయ‌క‌పోతే తెల్లార‌ద‌ని ఓ కోడి పుంజు అనుకుంద‌ట‌. అలా ఉంది ఈ ప‌త్రికా య‌జ‌మానుల తీరు. త‌మ ప‌త్రిక‌లు వెలువ‌డ‌క పోతే స‌మాజ గ‌మ‌నం ఆగిపోతుంద‌ని భ్ర‌మిస్తున్నారు. ఇలాంటి వాళ్ల అహంకార‌పూరిత ధోర‌ణులు ఇంకా వీడ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

అయినా ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి కొమ్ము కాస్తూ “న్యూస్” కాకుండా “వ్యూస్‌”ను ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చొప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ప‌త్రిక‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఎంత మాత్రం లేదు. అయినా వారం , ప‌దిరోజుల లాక్‌డౌన్‌కే ఉద్యోగుల జీవితాల‌ను త‌డిగుడ్డ‌ల‌తో గొంతుకోసే ఆంధ్ర‌జ్యోతి లాంటి ప‌త్రిక‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం, బాధ్య‌త టీడీపీపై ఉందే త‌ప్ప‌, ఇత‌రుల‌పై కాద‌నే స‌త్యాన్ని గ్ర‌హించాలి.

ప‌త్రికా విలువ‌ల‌ దిగ‌జారుడుతో పాటు ఉద్యోగుల‌ను బ‌లి పెట్ట‌డంలో ఆంధ్ర‌జ్యోతి ముందు వ‌రుస‌లో ఉంది కాబ‌ట్టి…దాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటున్నాం. సంపాద‌న కోసం ఈ ప‌త్రికా య‌జ‌మానులు దొంగ నోట్లు ముద్రించ‌డానికైనా వెనుకాడ‌రు. ఇలాంటి వాళ్ల‌ను ఆదుకునేందుకు విప‌త్తు కాలంలో ప్ర‌జ‌ల శ్ర‌మ‌ను దోచి పెట్ట‌డం ఎంత మాత్రం మంచిది కాదు.